“ఇచ్చట నొక విషయము చెప్పవలయును. మానవులకు సంకల్ప వికల్పములు జరుగుచుండును. అవి యెట్లు జరుగుచుండును ? మనస్సులో నవి యెట్లుదయించును ? మనసులో నుదయించిన సంకల్పమునకు రూపమున్నదా ? అది వట్టి కదలిక. దానికి రూపము లేదు. కదలికకు రూపమున్నది. కదలికయే రూపము.
సంకల్ప వికల్పాత్మకమైన మనసులోని సంచలమునకు గల రూపమెట్టిది ? అది శబ్దాత్మక మైనట్టిది.
లోకములోని వస్తువుల యొక్క కదలిక లోని రూపము ద్రవ్యాత్మకమైనది. ఒక తెల్లని గోడ యున్నది. సరిగా నా గోడ ఎంతతెలుపో యట్టితెలుపే కలిగిన వస్త్రము గోడకున్న మేకులకు బిగించి యారవేయబడి యున్నది. అచ్చట నట్టి వస్త్రము ఆరవేయబడి యున్నదని తెలియదు. గాలికి కొట్టుకొనును. అప్పుడు తెలియును. కనుక సంచలనము పదార్థములకు రూపము కలిగించునని అర్థము. సంచలనము వలన నేమి జరుగును ? రేఖ లేర్పడును.
అందుచేత సృష్టిలో పదార్థములకు రూప సంధానము చేయునది రేఖా నిర్మాణ శేలమైన సంచలనము. భౌమమైన పదార్థములయందు సంచలనము యొక్క స్వరూపము రేఖాత్మకముగా నుండును.
మనస్సులోని సంకల్ప వికల్పాత్మకమైన సంచలనము యొక్క రేఖ లెట్లుండును ? అది శబ్దాత్మకముగా నుండును. అయినచో గాలిలోని కదలిక వేఱు. మనస్సులోని కదలిక వేఱు. గాలిలోని కదలిక పాంచభౌతికములైన ద్రవ్యములను విస్పష్టము చేయును. అనగా నచ్చటనున్న ద్రవ్యము వికృతమగును.
ఆ పదార్థము గాలిచేత కదల్పబడవలయును. కదలిక పదార్థములను సృష్టించుటలేదు. పదార్థ స్థితిని నిరూపించు చున్నది. అట్లే సంకల్ప వికల్పములకు బహుళ శబ్ద పరిజ్ఞాన యుండవలయును.
‘నేను పోయి వానిని కలుసుకొందును’ అని యుచ్చరితమైన వాక్కు అనుచ్చరిత స్థితిలో మనసులో పుట్టును.
అనుదితమైన యా శబ్దమునకు రూపమున్నదా ? అనగా వాక్త్వ మున్నదా అని యర్థము. అది యంతయు భావమునందు మునిగియుండును.
కొందరు దానిని ‘పసి’ యందురు. ‘పసివాడు’ అన్న మాట కర్థమేమి ? ఏ భావములను మనము వాగ్రూపముగా చెప్పుదుమో అవి వాగ్విరహితమైన స్థితిలో వానియం దున్నవని యర్థము. పశువులకు ‘పసి’యే గాని జ్ఞానము లేదందురు.
తాదృశమై మరియు నెంతయో లోతైన యొక పరమ సూక్ష్మస్థితి పంచమి యొక్క మనస్సులో నుండెను. ఆమె జీవశక్తిలో నుండెను. ఆమె హృదయములో నుండెను.”
సంజీవకరణి, కాశ్మీర రాజవంశ నవలలు – 4, విశ్వనాథ సత్యనారయణ.
Leave a Reply