శ్రీపాద సుబ్రమణ్యశాస్త్రి – అనుభవాలు జ్ఞాపకాలు

అంత హుందాగా ఎవరన్నా రాయగలరా? కళాత్మక, చారిత్రక రచనలు సరే. మరి నిత్య సంభాషణల గురించో? స్వీయచరిత్రలు కూడా ఇంత బాగుంటాయా?

ప్రాక్టికల్ గా ఆలోచించే రచయతలు చాలా తక్కువ పరిచయం అవుతుంటారు. తన ఆలోచనలకు అంతగా ఆదరువు లేని రోజుల్లో, ఆ ఆలోచనా విధానాన్ని, అటువంటి మార్పు తన జీవన సరళిలో తీసుకొని రావడం ఎంత కష్టమో, ఎలా తీసుకొచ్చారో, చుట్టూ ఉండే జీవితాలని ఎంత క్షుణ్ణంగా పరిశీలించారో, భద్రపరిచి అందచేయటం అంతే కష్టం. ముందు తరాల వారి అవసరాన్ని గుర్తించగలిగిన మహా రచయిత, గురుతుల్యులు శ్రీపాద సుబ్రమణ్యశాస్త్రి గారు.

“మనవాళ్ళ నమ్మకం చదువు సంస్కారం కోసమని కాదు, పొట్టకూటి కోసం అని ఇప్పుడు. మన దౌర్భాగ్యానికి పతనానికి ఇదే బీజం.”

ఒకేసారి కాకుండా, ఎన్నో ఉదయాలలో. కానీ చదివిన ప్రతిసారి ఒక కొత్త శక్తి, కొత్త రుచి, ఆయన మాటల్లో. వాఖ్యాలలో సంపూర్ణత, స్పష్టత ఆయన శైలి.

“ముగ్గురు కొడుకుల్లోనూ ఒక్కరికైనా నేను మేనరికం చేసుకోవద్దూ? పోనీ అంటే మా చిన్న తమ్ముడు కిప్పటికిన్నీ సంతానం లేకపోయింది కదా, నాకిక పుట్టినిల్లు దూరం కావాల్సిందేనా?” ఒక తల్లి ఆవేదన, అంతకన్నా మాధుర్యంగా ఇంకెవరన్నా చెప్పగలరా?

ఆశయాన్ని, దాన్ని అందుకోవడానికి చేసిన ఆచరణని పరిచయం చెయ్యడమే గొప్ప సాహిత్యం. మొన్న ఒక స్నేహితుడు అడిగాడు, నాకు తెలుగు పుస్తకం చదవాలనుంది, కాని ఎప్పుడూ చదవలేదు, ఒకే ఒక్క పుస్తకం రికమెండ్ చేయ్యాలంటే ఏం పుస్తకం సజెస్ట్ చేస్తావ్ అని. ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా పలికిన పేరు “అనుభవాలు జ్ఞాపకాలు”. ఎందుకంటే,

నీకు ఏ విధమైన పుస్తకాలు నచ్చుతాయో, ఎటువంటి రచయితకు దగ్గరవుతావో, వివిధ సాహిత్య ప్రక్రియలు చదివితే తెలుస్తుంది. కానీ ఆసక్తి ఉందంటే ఖచ్చితంగా చదవాల్సినవి కొన్ని. మూలమైన తెలుగుదన్నాని పరిచయం చేసేవి. పునాది.

ఆయన మాటల్లో చెప్పాలంటే: “బాబు, మా స్వామి రచించిన మహాగ్రంథం ఇది. అది చదివి ఆనందించి, వొకళ్ళ నానంద పెట్టకపోతే, ఆ మహాకవికి మేము ద్రోహం చేసినట్లు కాదూ?”


Posted

in

,
COMMENTS

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *