
2016 లో Nepal వెళ్ళినప్పుడు, పశుపతి నాథ్ టెంపుల్ లో, ఆ గైడ్ “విక్రమసంవత్సరం” గురించి చెప్తున్నాడు. లోపల కొన్ని పెయింటింగ్స్ కూడా ఏవో చూపించాడు. అప్పట్లో మనసంతా ఎవరెస్ట్ ఎప్పుడెప్పుడు చూస్తానా అనే దాని మీదే ఉంది.
2 ఏళ్ళ క్రితం స్త్రౌట్స్బుర్గ్ (Pennsylvenia) లోని శృంగేరి శారదా పీఠం ఆలయానికి వెళ్ళినప్పుడు, అక్కడ ఉన్న చిన్న బుక్ స్టాల్ లో $1.50 కి కనపడింది, ప్రథమ ముద్రణ. అప్పట్లో (1969) Rs 2/-. ఎంతో అదృష్టం చేసుకుంటే గాని అలాంటివి దొరకవు. తీసుకొచ్చి దాచుకున్నాను.
ఈ సంవత్సరం చదవాలనుకున్న “నేపాళ రాజవంశ నవలలు” లో, “దూతమేఘము” పుస్తకం తెరిస్తే మొదటి పేజీలో ఇలా ఉంది.
“లోకములో మనుష్యులకు భాష ఎట్లు వచ్చును? పెద్దవారు మాటాడు కొనుచుండగా సందర్భమును బట్టి, వస్తు సంయోగమును బట్టి, లోపల కదలాడు చున్న చిన్న తెలివిని బట్టి అనుకరించుటకు ప్రయత్నింతురు. క్రియల యందట్లనుకరింతురో, మాటల యందు కూడా అట్లే అనుకరింతురు. సామాన్యముగా భాషలో, ఒక సవ్వడి హృదయమునకు ప్రియముగా నున్నదనుటకు అవ్యక్త మధురముగా నున్నదనియు, కలస్వమనియు నందురు. అవ్యక్త మధురమనగా సరిగా వ్యక్తము కానిది, మధురముగా నుండునది అని అర్థం. ఈ మాట ఎంతో రహస్యమిమిడి యున్న మాట. వ్యక్తమైన వెంటనే లోకమునందేమియు లేదని తెలిసి వైరాగ్య ముదయించును. లోకమునందు జనులు రమింపవలయు ననాగా సృష్టి రహస్యము జనులకు వ్యక్తం కాకూడదు. అందుకని యే లోకమునకు దీని మర్మము వ్యక్తము కాకుండా భగవంతుడు మాయను సృష్టించి నాడు. ఈ సృష్టి యే అవ్యక్తము. అందు చేత మధురం. ఈ సృష్టిలో ననేక విషయములు ఉన్నవి. మానవుని లౌకిక బుద్ధికి వానిలో ననేక విషయము లవ్యక్తముగా నుండును. అవి మధురములు. మాధుర్య మన్న శబ్దం యొక్క అర్థమే ఇది ఏమో. తెలిసీ తెలియ నట్లుండుట. దాని పేరు మాధుర్య మనవచ్చునేమో.”
“మ్రోయుతుమ్మెద”, “భ్రమరవాసిని”.. మొదలగు పుస్తకాలు ఇలానే మొదలవుతాయి. మూడు నాలుగు పేజీల తర్వాత కథ మొదలవుతుంది. ప్రథమ భాగం మాత్రమే ఒక ఎత్తు. చాలా తక్కువ పుస్తకాలే, ఉదయం లేస్తే, కథలో ఇవాళ ఎం జరుగతోందో అనే దాని మీదే ఆలోచన ఉండేలా చేస్తాయి.
ఎంతటి మహాకవి కాళిదాసు కైనా, మేఘదుతం లాంటి కావ్యాన్ని రచించడానికి చిన్న సందర్భం అవసరం. అంతటి మహాకవికి ఇటువంటి సందర్భం ఎందుకు ఎదురయ్యిండకూడడు అని ఊహిస్తూ, కనుమరుగవుతున్న అసలైన చరిత్రను, నేపాళ్, భారత రాజవంశాల స్నేహాన్ని, అద్భుతమైన కల్పనతో పరిచయం చెయ్యడం, ఈ “దూతమేఘము”.
“గోపాల” వంశంతో మొదలైన నేపాళ దేశ చరిత్ర, సూర్యవంశం మహారాజు అంశువర్మ, తన మనవరాలైన “దూతమేఘము” ల మధ్య సంభాషణతో మొదలవుతుంది. బృహస్పతి భట్టు ఆమె గురువు. అలా మొదలైన కథలో, బృహస్పతి భట్టు ఎలా మంత్రి పదవికి ఎదుగుతాడో, రాజ్యంలో నున్న వివిధ చిన్న క్షత్రియ వంశాలను ఎలా ఐక్యం చేయుటకు ప్రయత్నిస్తాడో.. మొదలగు అంశాలతో అద్భుతంగా సాగుతుంది.
అగ్నివంశ క్షత్రియుడైన విక్రమార్క చక్రవర్తి గొప్పతనం, చరిత్ర, ప్రవరసేనుని పారద్రోలిన వీరత్వం, అంశువర్మతో స్నేహం, పూర్వజన్మ వృత్తాంతం, భారత నేపాళ దేశాలలో వైదిక మత పోషణ, పశుపతినాథ్ ఆలయంలో పూజోత్సవముల వైభవాలు, అన్నింటికంటే ముఖ్యంగా రాజ సభలు జరుగు ‘దీప భవనము‘ వర్ణన, అహో అనిపిస్తాయి. చివర్లో విక్రమార్క చక్రవర్తి పూర్వజన్మ లో యక్షుడి గా, మహాకవి కాళిదాసు “మేఘసందేశం” కావ్యాన్ని పూర్తిచేస్తాడు.
నవల కల్పానాద్భతం ఎక్కడొస్తుందంటే, నేపాళ రాజ్య చరిత్ర పరిచయం, రాజనీతి వివరణ, బృహస్పతి భట్టు పాత్ర నిర్మాణం, సంభాషణా చాతుర్యం, అన్నిటికంటే : కాళిదాసు మేఘసందేశం కావ్యంలో మేఘానికి ప్రాణం పోస్తే, ఆ పాత్ర యొక్క ఆలోచన ఎంత లోతుగా ఉండాలో, అంత గొప్పగా ఉంటుంది. మేఘసందేశం వినడమే. చదవలేదు. చదవాలి.
“మ్రోయుతుమ్మెద” నవలలో చివర్లో విశ్వనాథ వారే ఒక పాత్రగా ప్రవేశిస్తారు. నేను చదివిన 20కు పైగా నవలలో బహుశా దానికే అగ్రస్థానం. అంతే. దాని గురించి వేరే పోస్టులో వివరంగా. చాలా రోజుల తరువాత మళ్లీ అంతే గొప్పగా అనిపించిన నవల ఇది. ఎందుకంటే విశ్వనాథ వారు తానే బృహస్పతి భట్టు పాత్ర ఏమో అని అనిపించింది. అలా అనుకొని ఇంకొకసారి పేజీలు తిరగేస్తే, ఇంకా రసవత్తరంగా ఉంది.
“కాళిదాసు, బృహస్పతి భట్టును కలిసి పీతాంబరములు దాల్చి దేవి మండప ద్వారము నందు చెరియొక వైపు నిలుచుండిరి. శ్రీ దుర్గాదేవి కటాక్షము జగత్తు మీద ప్రవర్తించినట్లు సూర్యోదయం అయ్యను.”

ఫోటో: 2016 లో నేపాళ్ వెళ్ళినప్పుడు, పశుపతినాథ్ ఆలయంలో.
Leave a Reply