స్వరరాగావధానాం – అనుభవం

నమస్కారం,

ఏప్రిల్ 2023 లో, S.S. music అకాడమీ – ఇంటర్నేషనల్ మరియు “వీధి అరుగు – నార్వే” వారు కలిసి నిర్వహించిన “స్వరరాగావధానాం”, గాన విద్యాప్రవీణ, సంగీత విశారద శ్రీ గరికిపాటి వేంకట ప్రభాకర్, కార్యక్రమంలో పృచ్ఛకుడిగా నేను పాల్గొన్నాను. ఇటువంటి అవకాశం కల్పించిన coordinators కి, గురువు గారికి ఎప్పుడూ ఋణపడుంటాను.  

సంగీత విద్యలో ఎటువంటి ప్రవేశం లేనప్పటికీ, సాహిత్యంలో ఉన్నటువంటి రవంత అభ్యాసంతో, నా అనుభవాన్ని ఇక్కడ పంచుకుంటున్నాను. ఇందులో ఏదైనా మంచి విషయాలు గ్రహించగలిగితే అది అంతా సంగీత గురువులు ప్రభాకర్ రావు గారికి, నా సాహిత్య గురువులు (పరోక్షంగా) విశ్వనాథ వారి గొప్పతనమే.
—–—–—–—–—–—–—–—–—–—–—–—–—–—–—–—–—–

అయిదేళ్ల క్రితం విశ్వనాథ వారి “మ్రోయుతుమ్మెద” అనే ఉద్గ్రంధం చదువుతున్నప్పుడు అనిపించింది బహుశా అంతటి సంగీత విద్యా ప్రవీణులని కలుస్తానా అని.  సంగీత విద్య గురించి, కేవలం కర్ణాటక, హిందుస్తానీ సంగీతమే కాకుండా ఎన్నో లోతైన విషయాలు ముఖ్యంగా భారతీయ గొప్పతనం, సంగీత విద్య గురించి చర్చించిన మహా గ్రంథం. ఆయన ఈ పుస్తకంలో వివరించలేదు గనుక ? కలిసిన సాహితీ మిత్రులతో కూడా అంటుంటాను, నాకు వేయిపడగల కన్నా మరింత ఉత్తేజం ఇచ్చిన బ్రహ్మాండమైన రచన అని. 

ప్రోగ్రాం కి రెండు వారాల క్రితం వచ్చిన రిమైండర్ చూసి, ఏ ప్రశ్న అడగాలా అని ఆలోచించి, విశ్వనాథ వారి పుస్తకాలలో చదివిన కొన్ని పద్యాలు సేకరించి, నాకు ఇచ్చిన అంశం (‘స్వరాక్షరం’) ప్రకారం, ఈ శ్లోకం ఐతే సందర్బోచితంగా ఉంటుందని అనుకొని, “మ్రోయుతుమ్మెద” చివర్లో వారు వివరించిన శ్లోకాన్ని ఎంచుకున్నాను. 

దృశా ద్రాఘీయస్యా దరదళిత నీలోత్పల రుచా… 
దలీయాంసం దీనం స్నపయ కృపయా మా మపి శివే.. 
అనేనాయం ధన్యో భవతి నచతే హాని రియతా… 
వనే వా హర్మ్యే వా సమకర నిపాతో హిమకరః !! 

చివరి అధ్యాయము మొత్తం బాలాత్రిపుర అమ్మవారి ధ్యానంలో ఉన్నటువంటి కథానాయకుడిని వివరిస్తూ, ఈ పద్య వివరణతో మనల్ని అమ్మవారి చరణాలు దగ్గర నిలబెడతారు. ఈ శ్లోకం సౌందర్య లహరి లోని 57వ శ్లోకం. కూర్పు జగద్గురువులు శంకరాచార్యులు వారు. ఈ పద్యానికి తాత్పర్యము:

దృశా ద్రాఘీయస్యా దరదళిత నీలోత్పల రుచా
నల్ల కాలువ కాంతులు వంటి కన్నులు  కలిగిన శ్రీ చక్ర నివాసిని, బాలాత్రిపుర సుందరి దేవి, నీ కరుణ, దయ, చాలా దీర్ఘమైనది. అనగా నింత దూరము ప్రసరించు, ఇంత దూరము ప్రసరించదు అని లేదు. రుచా.. కాంతి. అమ్మవారి ప్రకాశం సీతోత్పలము. విమర్శ నీలోత్పలము. అందుకే నీలోత్పల రుచా. దయ యొక్క లక్షణ మరమోడ్పు  కన్నులు కనుక దయను చూపించు తల్లీ అని ఇంకో అర్థము. 

దలీయాంసం దీనం స్నపయ కృపయా మా మపి శివే.. 
దీనుడను, దూరముగా ఉన్నవాడను. నన్ను కూడా నీ కృపతో స్నానము చేయింపుము. దూరముగా ఉన్నవాడను కనుకనే దీనుడను. మా మాపి….. నన్నుకూడా, అనుట చేత నీ కృప సర్వవ్యాపి గనుక నన్నెట్లును స్పృచించును. అయినను నన్ను కూడా స్నానం చేయింపు మనుటలో నీ యర్థము సిద్ధసాధ్య మగుచున్నది. స్నానము చేయించు అనుటలో ఈ ప్రపంచము అంతా అమ్మవారి కరుణా ప్రవాహము అని భావన. 

అనేనాయం ధన్యో భవతి నచతే హాని రియతా
అట్లు చేయుట వలన నేను ధన్యుడను. దీని వలన నీకు హాని లేదు. నీ కాంతి చేత అంధకారము తొలుగుటయే గాని, కాంతి యొక్క విశిష్టత తగ్గదు కదా.

వనే వా హర్మ్యే వా సమకర నిపాతో హిమకరః
అడవిలో నైనను, మేడ మీద అయినను చంద్రుని వెన్నెల ఒకటే కదా ? తల్లీ నీ దయ వెన్నెల వంటిది అని కూడా భావన. సర్వసృష్ఠి యందు  ఆమె భాసించుచున్నది అని అర్థము. ఆమె లేనిదెచ్చటా ? 

ఈ శ్లోకాన్ని నేను చాలా సార్లు విన్నప్పటికీ, నాకు ముఖ్యంగా గుర్తుండి పోయేది చిన్నపుడు ప్రతి శుక్రవారం ఇంట్లో జరిగే సౌందర్య లహరి, విష్ణు సహస్రనామమ్ పారాయణాలు, అందులో మా నానమ్మ పాడినప్పటివి. సంగీతం లేకపోయినను ఆడుకుంటూ వినడం వల్ల చాలా మటుకు నోటికి వచ్చును. ఇందులో అన్నీ స్వరాలు (గాంధారము ఒకే ఒక్క చోట తప్ప) ఉన్నందువలన, ఏదైనా సంపూర్ణ రాగం లో ఆలపించు వలసినదిగా గురువులకు నా ప్రశ్న.

సమయం పరంగా ఈ ప్రశ్న అడిగిన తరువాత నేను తాత్పర్యము వివరించడం కుదర్లేదు, కానీ గురువు గారు, ఈ పద్య అర్థాన్ని ఏంతో అద్భుతంగా వివరించారు. వారు సరస్వతి పుత్రులు, అమ్మవారి ఉపాసకులు. వారిని కలిసి నప్పటి నుండి ఎన్నో సార్లు సంగీత సాహిత్య ప్రశ్నలు అడగటం, వారి నుండి నేర్చుకున్నది ఎంతో ఉంది. సంగీతం, సాహిత్యం, ఆధ్యాత్మికతతో కూడిన ఎన్నో చర్చలలో నేను పాలుపంచుకోవడం ఒక అదృష్టం. ఈ ప్రశ్న వారు అలవోకగా అర్థం వివరించి, ఆ అమ్మవారి కరుణ రసాన్ని “సావేరి రాగం”లో పరమాద్భుతంగా ఆలాపించారు. ముఖ్యంగా “వనేవా హర్వ్యేవా” అన్నచోట ప్రార్థన రూపము  కలిగించి ఎంతో సంతృప్తినిచ్చిందని చెప్పాలి. 

నేను పాల్గొన్న కార్యక్రమం రెండు గంటలు ఉన్నపటికీ, గురువుగారు 104 మంది పృచ్ఛకుల ప్రశ్నలు దాదాపు 24గంటలు పైగా ఇలా ఆలపించడం, ఎన్నో రకాల సంగీతాన్ని రాగ మార్పులతో అందరికీ పరిచయం చేయడం, ఎంత అద్భుతమైన విషయమో, లోతుగా ఆలోచిస్తే ఎన్నో ప్రశ్నలు తట్టాయి. ‘అవధానం’ అంటున్నారు గాని నాకు మటుకు అదొక ‘సంగీత’ యజ్ఞం లాగా తోచింది. అందులోనూ  ప్రోగ్రామ్ చూసేకొద్దీ, అందరి పృచ్చకులు వాళ్ళ వాళ్ళ గురువులని స్మరించుకోవడం, స్వయంగా గురువుగారు బాలమురళీకృష్ణ గారిని గుర్తు తెచ్చుకోవడం, వారిని తీసుకురావడం, ఒక గొప్ప వారసత్వం (Rich Heritage) న్ని నిలబెట్టడం కాదా ? సాంప్రదాయాల్ని ఇలాంటి గొప్ప కార్యక్రమాలే గా కాపాడేది ? కార్యక్రమం జరుగుతున్నంత సేపు నేను గురువుగారిని, పక్కన ఉన్న సరస్వతి అమ్మవారిని చూస్తుంటే ఇంకో చదివిన విషయం జ్ఞప్తికి వచ్చింది. ఎవరో ఒకసారి విశ్వనాథ వారిని ఇలా అడిగారట, ‘ సాక్షాత్తు శివుడే యెదుట నిలుచుండగా నింక సరస్వతి యెందులకు ? ” అని. దానికి సమాధానం ఇలా:

“అట్లు కాదు. శివునకు సరస్వతికి భేదమేమి ? శివుడు పైభాగము ;లేనిచో లోపలి భాగము.  సరస్వతి వెలి భాగము. లేనిచో ఆవిష్కృత భాగము. యోగి తనయందు తాను రమించును. సాక్షాచ్ఛివ దర్శనము చేతనే యతడు తృప్తి బొందును.
కవియును గాయకుడును వీరట్టి యోగులు కారు. వీరి యోగలక్షణము వేరు. వీరు ప్రధాన చైతన్య రూపమైన శివుని ఆరాధించరు. వాని నుండి బహిష్కృతమగుచున్న సరస్వతిని ఆరాధింతురు. వెలుగును ఆరాధించినచో సూర్యదేవునారాధించినట్లే. యోగులు సమాధి గతులగుదురు. గాయకుడు మరియు  కవి తాను సరస్వతితో ఐక్యము భజించునపుడు తానేమగుచున్నాడు ? శివుని యొక్క వెలుగగుచున్నాడు. మణికిని మణినుండి వినిర్గమించు కాంతికిని భేదము లేదు”. 

వివిధ దేశాల నుండి వంద మందికి పైగా ప్రుచకులతో , పలానా అంశం అనే భేదం లేకుండా వేసిన ప్రశ్నల్ని, ఎన్నో రాగాలలో సమాధానం చెప్పాలంటే సంగీతం లోనే కాకుండా సాహిత్య, విమర్శ, ఆధ్యాత్మికత మొదలైన రంగాల్లో ఎంతో పాండిత్యం ఉండాలి. అయిదు నిమిషాల కన్నా తక్కువ సమయంలో ప్రశ్నను పూరించారంటే అవధాని గారు కేవలం సంగీత విద్వాంసులే కాదు, కవి కూడా. సంగీత సరస్వతి ఆరాధనని, ఆ రాగ మాధుర్యాన్ని మనకు, “ద్రాఘీయస్యా” ఈ దేశము ఆ దేశము అని తేడా లేకుండా, అందించ సంకల్పించారంటే ఋషి కూడా. స్వస్తి. 

– విశ్వనాథ అశోక్ వర్థన్


Posted

in

,
COMMENTS

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *