
టీవీలో స్వాతికిరణం సినిమా 2 వారాలకు ఒకసారి వేస్తుండే వాళ్ళు. 12 ఏళ్ళ వయసులో పాటలు అర్థం కాకపోయినా, గుర్తుండి పోయేవి. పాడుకుంటూ ఉండే వాడిని క్రికెట్ ఆడుకుంటూ.
‘వైష్ణవి భార్గవి వాగ్దేవి త్రిగుణాత్మికే, వింధ్య విలాసిని వారాహి త్రిపురాంబికే..’
కాలేజీలో చేరినప్పుడు, అర్థం చేసుకోవడానికి ప్రయత్నం. తెలుసుకునే కొద్దీ అద్భుతంగా అనిపించేవి. బహుశా సినిమా సాహిత్యం పట్ల అంత ఇష్టం, గౌరవం పెరగడానికి అదే తొలిమెట్టు.
‘శుభలగ్నం’ సినిమా చూసి, రోజా ఎం ఘనకార్యం చేసింది, అలా ఫ్లైట్ ఎక్కి త్యాగం చేసి వెళ్ళి పోయేటట్టు చూపించారు అనుకున్నా. ఆ తర్వాత ఇంటర్వ్యూలో ఎస్.వి.కృష్ణారెడ్డి గారు అన్నారు, ఆ సినిమా హీరో సిరివెన్నెల గారని. ఎండ్ టైటిల్స్ పడేటప్పుడు:
“మంగళ సూత్రం అంతటి చవకా,
సిరి ఉందని వెల కడతావా,
బేరం ఏమిచ్చిందమ్మా,
నూరేళ్ళ భారం కాక… (చిలకా)”
అని బ్యాక్ గ్రౌండ్ లో వచ్చినప్పుడు అర్థమైంది, ఎందుకన్నారో ఆయన హీరో అని.
గమనించాలి అవి రోజా వెళ్లిపోయేటప్పుడు వచ్చే లైన్స్. ‘ఆమని‘ ఒంటరితనాన్ని చూపించే పాట మనం చాలా సార్లు విన్నాం.
“మంగళ సూత్రం అంగడి సరుకా,
కొనగలవా చెయ్యి జారాకా,
లాభం ఎంతొచ్చిందమ్మా,
సౌభాగ్యమ్ ఆమ్మేశాకా… చిలకా”)
“తండ్రినే నేనైనా దండమే పెడుతున్నా,
తల్లిలా మన్నించు మెల్లగా దండించు….,
కాళిలా మారమ్మా కాలితో తన్నమ్మా,
బుద్దిలో లోపాలే దిద్దుకో నీవమ్మా.”– ఇంద్రుడు చంద్రుడు
అసలు ఎలా రాశారు ? ఇలా హద్దుకునేలా? “నీకు ఇళయరాజా, కమల్ హాసన్ కనబడుతున్నారేమో, నాకు సిరివెన్నెల కనబడుతున్నాడు.” అని అనుకుంటూ డిస్కస్ చేసిన పాటలు లెక్కలేనన్ని.
“సుకుమారమే ఆమె చెలికత్తె కాబోలు,
సుగుణాలకే ఆమె తలకట్టు కాబోలు,
చెలియ చలువ చెలిమి కొరకు,
ఆయువే ఆశగా తపములు చేయగా.” – సుస్వాగతం
ఇంత అందమైన సాహిత్యం మాకు అందించే వారు ఉన్నారని కాలర్ ఎగరేసి గర్వంగా చెప్పుకుంటుంటే, మమ్మల్ని అప్పుడే ఒదిలేసి వెళ్ళిపోయారేంటి సార్ ?
Sirivennela Seetharama Sastry (20 May 1955 – 30 November 2021)
Leave a Reply