
స్వామీ వీరాంజనేయా!
సనాతనాన్ని సాంప్రదాయ లోతుల్ని,
ఎనలేని పుస్తక నిధి రూపంలో మాకు ప్రసాదించిన,
మా శిలోద్భవజ్యోతిర్మూర్తి,
స్వర్గంలో కుశలమేనా… వీరాంజనేయా!
అచట్టి సంలాపములను మాకు తెలియ తరిస్తే,
ఆశువుగా చెప్పదలిస్తే, కాస్త వ్రాసి,
మా కొరకు తీసుకు రావయ్యా… వీరాంజనేయా!
అంత తెలుగు బోధించే గురువు,
దక్కకపోవడం నా దురదృష్టం అనుకున్నావేమో,
అట్టి వారిని కొలిచే ఎందర్నో పొందడం,
అదృష్టం కాదటయ్యా… వీరాంజనేయా!
కల్పవృక్షం చదివిన తరువాత,
రామభక్తిలో నీ అంతటి వారు ఉన్నారంటే,
నీ మనస్సు నొచ్చుకుంటుందేమో,
మీరిద్దరూ నాకు శివాంశ సంభూతులే కదయ్యా… వీరాంజనేయా!
చరిత్రకు తెరలు తగిలించి, తప్పుదారి పట్టించే
ఎన్నో పుస్తకాలను మోస్తూ, మగథ కాశ్మీర
నేపాల రాజ్య నవలలు వంటివి ఉన్నాయని తెలియకపోవటం,
దౌర్భాగ్యం కాదటయ్యా… వీరాంజనేయా!
ఆలోచనా ధోరణిని వక్రీకరిస్తున్న రచనలు
వస్తున్న తరుణంలో, అట్టి స్వేచ్ఛ హద్దు దాటితే
ఎదురయ్యే పరిణామాలను, గర్జించి వినిపించిన,
“చెలియలికట్ట” లోని ఆవేదనని గమనించ మనవయ్యా… వీరాంజనేయా!
అట్టి పరాకాష్ఠని అర్థం చేసుకునే శక్తి లేదని,
వారి అభిప్రాయాలను అటకెక్కించారే,
ఎక్కలేని పర్వత ఎత్తుతగ్గించాలనుకునే
మూర్ఖులని చూడవయ్యా… వీరాంజనేయా!
ఆధునిక మత్తులో మునిగిపోకుండా,
ఆయన పంచిన వెలుగుతో, ఇంకా
కొన్ని నక్షత్రాలు వెలుగుతున్నాయని,
నీ శక్తితో ఆయనకు చూపించవయ్యా… వీరాంజనేయా!
నేడు విశ్వనాథ వారి 127వ జయంతి !
Leave a Reply