2022లో నేను చదివిన కొన్ని..

తెలిసిన రచయితల పుస్తకాలు కాస్త పక్కన పెట్టి, కొత్త రచయితల వేటలో సాగింది 2022. అప్పుడప్పుడు ఎఫ్బీలో పోస్ట్స్ ద్వారా అభిప్రాయం పంచుకోవడమే కాని, ఎప్పుడూ ఒక పబ్లిక్ ప్లాట్ఫార్మ్ మీద రాయలేదు. ఇదే మొదటి సారి. ఈ వ్యాసం pustakam.net లో ప్రచురించబడింది. అక్కడ పోస్ట్ చేసిన నెల తర్వాత ఇక్కడ.చదివిన వన్నీ కాకపోయినా, అందులో నచ్చినవి, ఇతర పాఠకులకు ఉపయోగపడతాయి అనుకున్న కొన్ని ఇక్కడ.

1. మంచి వెన్నెల వేళ – సుస్మిత

“మెదడుని తృప్తి పరిచే వేదాంతాలు ఎలాగున్నా, హృదయానికి శాంతి నిచ్చెదేదో ఉండాలి కదా?”.. అంటారు కృష్ణశాస్త్రి గారు. 

గత ధనుర్మాసంలో ఇంటికి వచ్చిన రంగడి ప్రసాదం, ఈ పుస్తకం. రేపల్లె, యమున, కృష్ణ లీలలు, ఈ కథలు. ఎంత అందంగా చిత్రీకరించారో. చిన్నప్పుడు భాగవతం కథలు విన్న ప్రతిసారి వినాలనిపించేవి. ఎన్ని సార్లు చదివాను ? ఎన్నో సార్లు. కుదిరిన ప్రతిసారీ. మళ్ళీ ఇంకో కొత్త కోణంలో ఇలా. తిరుప్పావై పాశురాలని మా రంగనాథ గుడిలో వినడమే కానీ, ఎప్పుడూ ఒక పుస్తకరూపంలో చదవలేదు. కృష్ణశాస్త్రి గారి పాటలకు ఒక కథను అల్లి, అసలు ద్వాపరయుగంలో గోపికలు ఆ కిట్టయ్య కోసం చేసిన “కాత్యాయని వ్రతం” ఆధారం చేసుకొని ఎంత బాగా రాశారో.

2. కృష్ణశాస్త్రి గారి వ్యాసావళి. 5వ భాగం. 

భావ గీతాలు విన్నాను గానీ, వీరి వ్యాసాలు ఇంత అద్భుతంగా ఉంటాయా ? కవి పరిచయాలను కూడా ఇంత గాంభీర్యంగా చెప్పగలరా ? “మహాకవులు ఎందుకు రావడం లేదంటే” అన్న వ్యాసం ఇచ్చినంత స్పూర్తి, మరో వ్యాసం ఇవ్వలేదు. 

“సామాన్య మానవుడు గురువు కాగలడు, కానీ ఋషియే గురుదేవుడు కాగలడు. వాల్మీకి గురుదేవుడు. వ్యాసుడు గురుదేవుడు. రవీంద్రుడు గురుదేవుడు.” ఇంత బ్రహ్మాండంగా చలం గారు కూడా చెప్పడం నేను చదవలేదు.

3. గొల్లపూడి మారుతీరావు గారి:
a. సాయంకాలమైంది.
b. రుణం
c. పిడికెడు ఆకాశం.
d. జీవన కాలం – 1,2 (కొన్ని).

సుభద్రాచార్యుల పాత్రతో కళ్ళనీళ్ళు పెట్టించారు తాతయ్య. (అవును మా తాతయ్య అచ్చం గొల్లపూడి వారి లాగా ఉండేవారు). చదవడం మొదలు పెడితే, కింద పెట్టకుండా ఉండే పుస్తకాలు కొన్నే. అందులో వీరివి ప్రప్రథమం. సహజ రచనా శైలి, ఎన్నుకున్న అంశం కానీ, ఎక్కడా బోర్ కొట్టకుండా రాస్తారు. చల్లటి సాయంకాలం వేళ వీచే గాలిలా. అలా చాలా సాయంకాలలు. హత్తుకుంటాయి, నవ్విస్తాయి, సాంప్రదాయాన్ని గుర్తుచేస్తాయి, కళ్ళు చెమ్మగిల్లేలా చేస్తాయి ఆ పాత్రలు. విశ్వనాథ, చలం, మల్లాది, శ్రీపాద వారి తర్వాత ఈ మధ్య బుక్ షెల్ఫ్ లో వేరే అర కేటాయించడం మొదలు పెట్టాను వీరికి.

“రోగాన్ని అనుభవించడం ఒక బాధ అయితే, దాన్ని అంగీకరించి ధైర్యం చెప్పే మనుషులు దొరకడం అదృష్టం”.

4. నాలుగో ఎకరం – శ్రీరమణ.

అమరావతి కథలను గుర్తుచేసింది ఈ పెద్ద కథ. నవలా రూపంలో ఇంకాస్త పెద్దదిగా ఉంటే బాగుండేది అన్నట్టు అనిపించింది.  

 “అంతా సూచించేవారు గాని, నన్ను శాసించే వారు లేరు. అదే నా సమస్య.”

5. “What does it mean to be an Indian?” – Prof S.N Balaganghadhara

Religion, Tradition, Culture, Colonialism, Past, Discrimination. Psychology, Language.. ఇలా అన్నింటినీ విడదీస్తూ, అసలు నువ్వు ఇండియన్ అని చెప్తే, ఎం రెప్రసంట్ చేస్తున్నావో తెలుస్తోందా అనే దానికి ప్రోఫెసర్ గారి పరిశోధన సమాధానం. మారుతున్న కాలానికి తనవంతు ఆన్సర్ ఇస్తూ, దాన్ని నిరూపిస్తూ రాసిన ఎక్సలెంట్ బుక్. దీని గురించి వేరే వ్యాసం రాయాలి. వారి బ్లాగ్.

6. “బ్రాహ్మణగ్రహారం” – శ్రీపాద వారి కథలు.

ప్రశ్న, జవాబుల వేట లాగా ఉంటుంది, శాస్త్రి గారి కథంతా. ఆ కాలానికి, ఈ కాలానికి వర్తిస్తుంది. 20 చిన్న పేజీలు. కానీ పెద్ద ప్రశ్నలు. 

“మనిషిని ధనం నిలువ చేస్తుందా, లేక ధనాన్ని మనిషి నిలవ చేస్తాడా?”

7. Factfulness – Prof. Hans Rosling
ప్రపంచం పట్ల మనకున్న నెగటివ్ దృక్పథం తప్పిపుచ్చుతూ, డేటాతో అసలు ఎంత ఎదుగుదల సంపాదిస్తున్నమో చూపించే ఐ-ఓపెనర్. స్టాటిస్టిక్స్ ఇష్టపడే వాళ్ళకు చాలా నచ్చుతుంది. 

8. ఆదిత్య హృదయం – తత్వ ప్రకాశిక వాక్య. 
రచించినది: మహామహోపాధ్యాయ స్వామి తత్వవిదానంద సరస్వతి.

కెమిస్ట్రీలో పి.హెచ్.డి పొంది, ఆ తర్వాత ఆర్ష గురుకులం స్థాపించిన సరస్వతి గారి పుస్తకం. ఒక్కొక్క శ్లోకానికి వివరణ ఇస్తూ, పురాణ ఇతిహాసాల్ని విడదీస్తూ, ఎందుకు ఆదిత్య హృదయం చదవాలో చెప్పే గొప్ప వాక్య.

9. The Demons under Microscope – Thomas Hager

చరిత్రలో ఎన్నో విషయాలు మనకు తెలియకుండా కప్పేశారు. యుద్ధం గురించి తెలుసు, కానీ ఆ వెనకాల ఉన్న హెల్త్-సైన్స్ లోని అనేక రహస్యాలను, వివిధ సైంటిస్ట్ల కృషిని తెలిపే అద్భుతమైన పుస్తకం. ఈయన పుస్తకాలకు పెద్ద ఫ్యాన్. వారి “The alchemy of air” గురించి నా blog lo

10. India After Gandhi – Ramachandra Guha

తెలిసిన చరిత్ర. కానీ తెలియదు. చాలమందికి. స్వాతంత్రం తర్వాత జరిగిన ఎన్నో విషయాలను తెలుపుతూ, అసలు దేశం ఇలా ఎందుకు ఉందో అనే ప్రశ్నకు కాసింత సమాధానం లభించే పుస్తకం. వెయ్యి పేజీల పైమాట. ఎనభై శాతం పూర్తయింది. 

11. హిమజ్వాల – వడ్డీర్ చండీదాస్

ఇంకొక 1000 పైగా పేజీలు ఉన్న నవల. ఒక్కొక్క అధ్యాయం ఒక్క పుస్తకంలా ఉంటుంది. మా నాన్నగారి స్నేహితుడు మరియు చండీదాస్ గారి అభిమాని అందించారు. లాంగ్ రీడ్. క్లైమాక్స్ తప్ప మిగతా పుస్తకం చాలా లోతుగా ఉంటుంది చాలా చోట్ల. మరొక పోస్టులో దీని గురించి మాట్లాడుతాను. 

12. The theory of leisure class – Thorstein Veblen

ఎంత సాధించిన ఏదోఒక దాని వెనకాల మనిషి పరిగెత్తే సొసైటీ మీద తత్త్వాన్వేషన. ఇందులో “conspicuous consumption” చాలా బలమైన అంశం. క్యాపిటలిస్టిక్ సొసైటీలో ఇది విలాసము, ఇదే వికాసము అని చెప్పి, దాన్ని చేదించడమే లక్ష్యంగా పెట్టుకుంటే ఉన్న పరిణామాల మీద 1895 లో చేసిన విశ్లేషణ. 

13. One dimensional man — Herbert Marcuse

ఫ్రీ సొసైటీ, ఫ్రీ ఛాయిస్ అని ఆధునిక నాగరికత లోని తప్పుల్ని ఎత్తి చూపే విశ్లేషణ. పోను పోను మనుషులు వాళ్ళకున్న materialistic ప్రపంచంలో, ఒకరినొకరు పోల్చుకుంటూ బతుకుతారో, అది ఎంతవరకు తప్పో, అసలు అందర్నీ ఒకే డైమెన్షన్ లోకి ఎందుకు నెడుతున్నామో అని రచయిత ప్రశ్నిస్తారు. జర్మన్ తత్త్వ వేత్తల పట్ల ఆసక్తి ఉన్న వారికి నచ్చుతుంది. 

14. వేటూరి పాటలు – మాటలు. జయంతి చక్రవర్తి గారి సంకలనం. 

తెలిసిన 90’s క్లాసిక్స్ కొన్ని, తెలియని అలనాటి మధురాలు కొన్ని. ఎప్పటికీ గుర్తుండే వాటిలో చేరిన ఇంకొన్ని. మచ్చుకు:

ఏ గగనమో కురుల జారి నీరైపోయే, ఏ ఉదయమో నుదుట చేరి కుంకుమైపోయే. 
మగువ సిరసున మణులు పొదిగెను హిమగిరి,  కలికిపదములు కడలి కడిగిన కళ ఇది. 

15. చలం లేఖలు తారకానికి

ఇప్పటివరకు బయటకు రాని ఉత్తరాలు. ఆయన రాసిన నాలుగు లైన్ల ఉత్తరంలో కూడా, పది కొత్త పదాలు దొరుకుతాయి. అది ఆయన వచనం యొక్క మ్యాజిక్. అప్పుడప్పుడు, రోజుకొకటి. 

“ఏ రోజు మన సాధన మనకు ఉపయుక్తము అవుతుందో, ఆ రోజే సాధనకు విశ్రాంతి దొరుకుతుంది. విశ్రాంతినేకాదు, శ్రాంతిని కూడా సాధనంగా తీసుకోవడం నేర్చుకోవాలి మనం.”

16. పాటలు పుట్టిన తావులు – వాడ్రేవు చినవీరభద్రుడు

కొత్త సాహిత్యం గురించి తెలుసుకోవాలంటే ముందుగా భద్రుడు గారి బ్లాగ్ చదవాలి. అందులో దొరకనిది ఉంటుందా ? సంగ సాహిత్యం యొక్క విశిష్టత, ఆ భక్త కవుల గొప్పతనం, ఆ గోపురాలలో ఉన్న ఎన్నో విషయాలు, ఆ కవుల పాటల్ని తెలుగులోకి అనువదిస్తూ వేరే లోకంలోకి తీసుకువెళ్తారు. తమిళ సాహిత్యం పట్ల మక్కువ పెరగడానికి తొలి మెట్టు. 

17. నోబెల్ తారలు – ముక్తవరం పార్థసారథి

కొన్ని 2021లో, కొన్ని ఈ సంవత్సరంలో. ఈసారి ఆకట్టుకున్న కథ విలియమ్ గౌల్డింగ్ గారి “మూడు బొమ్మలు”. ఆయన ఆలోచనలు ఎంత నిమ్నంగా ఉంటాయో, అనువాదం కూడా అంతే గొప్పగా చేశారు. ఒక తార గురించి తెలుసుకోవడానికి ఎంతో టైమ్ పడుతుంది. అందుకే అప్పుడప్పుడు కొన్ని.

“ఆశయాలకు, ఆచరణకు మధ్యనున్న అఖాతాన్ని పరిశీలించడమే గొప్ప ఆనందం!”

18. The Tyranny of Merit – Micheal Sandel

“సేపియన్స్” పుస్తకం చదివిన తర్వాత, యూట్యూబ్ లో యువల్ హరారి గారి టాక్స్ విన్నప్పుడు పరిచయమైన రచయిత. ఇది 2021 చివర్లో స్టార్ట్ చేసి 2022 లో పూర్తి చేశాను. అమెరికాలో మిలియనీర్స్ ఎన్ని తప్పు దారులు తొక్కుతారో చూపిస్తూ, అసలు దేశం ఎందుకు డివైడ్ అవుతుందో, ఎప్పటికీ సమానంగా అవకాశాలు ఎందుకు కుదరవో లోతుగా పరిశీలన చేసిన పుస్తకం. ఎక్సలెంట్ రీడ్. 

19. The Dharma Bums — kerouac

ఇలాంటి పుస్తకాల నుంచి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. పెంగ్విన్ బుక్స్ వాళ్ళ క్లాసిక్స్ లో ఉందని తెలిసికొన్నాను, ఇంటి దగ్గర బుక్ షాపులో. సగం సగం ఈస్టర్న్ కల్చర్ని అర్థం చేసుకొని వెస్టనర్స్ కొని తెచ్చుకున్న “False Spirituality” కి ఈ పుస్తకం నిదర్శనం.

20. కల్లూరి భాస్కరం గారి: 
a. వేయిపడగలు నేడు చదివితే
b. మంత్రకవాటం తెరిస్తే మహాభారతం మన చరిత్రే

మొదటిది “వేయిపడగలు” కి ఆంగ్ల నవల “గాన్ విత్ త్ విండ్” కి  కంపారిజన్. రెండవది “రూట్స్” పుస్తకాన్ని పరిచయం చేస్తూ మహాభారతంలో అంశాల గురించి చర్చ.  రెండు పుస్తకాలు ఒక పది శాతం చదివాను. అంతకు మించి ముందుకు పోదల్చలేదు. పోనవసరం లేదు. 

వివిధ పత్రికలలో, బ్లాగుల్లో నాకు నచ్చిన వ్యాసాలు కొన్ని:

చందమామ ఎంత దూరంనౌడూరి సూర్యనారాయణ మూర్తి 
స్థితప్రజ్ఞతా వాదం: వర్తమాన సమస్యలకి ప్రాచీన పరిష్కారం 
అద్వైతము గురించి సిద్దాంత దీపికలో.
ఫేస్బుక్ లో పరిమి శ్రీరామనాథ్ గారి వ్యాసాలు.
యూట్యూబ్ ఛానల్ అజగవ – రాజన్ గారి పుస్తక పరిచయాలు.
అశోకుడెవరు?
జగమునేలిన తెలుగు 
కావ్యకంఠ గణపతి ముని అంటే ఎవరు? ఆయన విశిష్టత ఏమిటి?
The Indian in hills — నారాయణస్వామి గారి చిన్నకథ.
మహారచయిత సురపరాజు రాధాకృష్ణమూర్తి గారి గురించి.
తెలుగు సాహిత్యంలో వ్యక్తి –  రాణి శివశంకర్ శర్మ
కొ. కు. కథ “కుక్క” వినండి
మాంటెక్ సింగ్ అహ్లువాలియా గారి ఇంటర్వ్యూ. 
1901 film The Brahmin and the Butterfly


Posted

in

,
COMMENTS

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *