
ఎప్పటికన్నా చదవాలి.. అని ఎన్ని సార్లు అనుకున్నానో. కానీ అవి తెలుగులో శిఖరాలు గా చుస్తారే. చడవగలిగే అంత Base ఏర్పడిందా?..
అలా అనుకుంటూ ఆ గ్రీష్మంలో మొదలుపెట్టిన తర్వాత… కాలం ఎలా గడిచిందో. లలిత కళలకు అక్షరరూపం ఇంతబాగుంటుందా ? వేయిపడగలు చదవలేదు.. కానీ సమానంగా చూశారంటే… తప్పులేదు. ఆ వర్ణనలను నెమరేసుకుంటూ ఆహ్లాదంగా ఆఫీస్ కి వెళ్ళిన రోజులు ఎన్నో. రామయ్యా, ఇంత అందంగా ఎవరన్నా చెప్పగలరటయ్యా…..
“తారకాంతలే శాంతములేక సౌఖ్యము లేదు అని పాడుచున్నట్లయినది. చీకటిలో గనబడని పూవుల సౌరభమే సంగీతమై విశ్వమంతయు నావరించి పోయినది.
గులాబిపూల పాలగొంతుకనుండి వెడలు నా పవిత్ర స్వనముతో బోల్చుటకు నారయణరావు కీ ప్రకృతిలో నేదియు తలపునకు రాలేదు. వేణువనస్వనములా, సెలయేటి గానములా, తుమ్మెద ఝుంకారములా, ఇవి యేవియు దగవని యాతడు తలయుచినాడు. కోకిల గొంతులు కావచ్చు ననిపించినది.
నారాయణరావు హృదయము ఆనందపూరితమై ప్రేమపూర్ణమైనది.
“నను పాలింపా, నడిచి వచ్చితివో!” చిట్టి రాముడు, నీలమేఘశ్యాముడై తొనలు తిరిగిన చిరుచేతులతో చిన్న బంగారువిల్లు పట్టుకొని, నవ్వులు వెదజల్లుచు, నడిచివచ్చినట్లాతన్ని గోచరించినది. అతని కన్నుల నీరు తిరిగినది.ఆ గొంతులో చినికి శ్రీరాముడే గలడు. శ్రీరామయ్య గారి కంఠములో దుష్టరాక్షససంహారుడగు రఘువీరుడే కోదండపాణియై అనుజ సౌమిత్రులతో సాక్షత్కరించుచున్నాడు.ప్రశాంతమగు నా సంధ్యారాగములో మిళితమగు శ్రీరామయ్య గారి కమాను కదుపులో శారదాదేవి గళమునుండి తొలుకాడు కలికి చెలువంపు తీయసవ్వడులు గలిసి, లత్తుక తీర్చిన చిన్నారిపాదలపై పరికిణి యంచులు చిందులాడ, కనక కింకిణీనూపరఘల్ఘ లారవముతో శీతనగ స్వచ్ఛ హిమశకలము పై నృత్యమొనర్చు సుమబాల విశ్వమోహనమగు కంఠ కుహూకారములు విరయించినట్లయినది నారయణరావుకు.
“ఎటుల బ్రోతువో తెలియా, ఏకాంత రామయ్య…”
ఆర్తరక్షకుడగు నా శ్రీరామచంద్రమూర్తి ఎంత చక్కని ప్రభువు ! ప్రోచిననాతడే ప్రోవలయు. శ్రీరామ నీలమేఘము భక్తమనః కేదారముల ౠర్ణసస్యముల బండించుగదా ! పరాప్రకృతియగు సీతమ్మ తల్లియు, పరమాత్మయగు శ్రీరామచంద్రుడును నవ్యయులు, సత్యచేతన ప్రదాతలు “ప్రోచినను కబళించినను నీదే భారము నీదె భారము ప్రభూ ! రామ రామా! యని రంజిల్ల నా వంతు, నియతియై రక్షింప నీది వంతు” అని కన్నులు మోడ్చినాడు నారయణరావు !”
“ఏ కొండలలో పుట్టినవో, ఏలోయలో ప్రవహించి వచ్చినవో, ఏ మెట్టలెక్కినవో, ఏ పల్లముల నింపినవో, రెండు జీవిత ప్రవాహాలు చెరియొక దారి నరుదెంచి, యీ పుణ్యవివాహ వేదికకడ సంగమించి ప్రయాగతీర్థమై పరిణమించును కదా యనుకొని నారయణరావు అక్కజపడెను.….
శారదయు దాను నక్కచెల్లెండ్రయి యుగాల వెనుక నొక్క మేఘశకలములో నుండి విడివడిన కవలపిల్లలై యాడుకున్నట్లూ హావేశము కలిగినది. తాను పురుషుడట, శారద ప్రకృతియట: తాను పురుషోత్తముడట. శారదా మహా సృష్టియట.”
Leave a Reply