పశుపతిశాస్త్రి ఆ వెన్నెలలో చాప వేసికొని వీణ వాయించుచుండెను. హిందుస్తాని ‘తోడి’ రాగమును వాయించుచుండెను. ఈ రాగమును ముత్తుస్వామి దీక్షితారు తీసికొని వచ్చెనట ! దీనికి ‘సింధుభైరవి’ యని యింకొక పేరు గలదు.
షడ్జము, శుద్ధ ఋషభము, సాధారణ గాంధారము, శుద్ధ మధ్యమము, పంచమము, శుద్ధ దైవతము, కైశికి నిషాదము – ఈ సర్వసంపుటి చేతనే యీ రాగము సర్వమైన విషాదభావనము మూర్తి కట్టినట్లుండును.
అవరోహణారోహనములలో చతురశ్రుతి ఋషభమును ప్రతి మధ్యమమును కలుగుచున్నవి. సాధారణ గాంధారము నుండి మధ్యమమును చేరినప్పుడెల్ల ప్రాణము తేలిపొవుచుండెను. వసుంధర యొక్క సర్వవిషాద చరిత్రయు నా చేరుటలో కనిపించుచుండెను.
ఓహో ! యేమి రాగము ! ఆ సాధారణ గాంధారము నుండి షడ్జమమునకు చేరిన ధ్వనిలో శ్రీరామచంద్రుడు సీతను వనవాసమునకు పంపినట్లు, నలుడు దమయంతి చీర చించుకొని పోయినట్లు, ద్రౌపదీ వస్త్రాపహరణము జరిగినట్లు, పుత్ర వియోగార్త యయిన తల్లి దుఃఖించినట్లు, పరమేశ్వరానుగ్రహం లేక జీవితమంతయు శిధిలమైనట్లు, హృదయములో దిగులు పుట్టుచుండెను.
అంత దుఃఖమయమైన ఆ శ్రుతులలో వెనుక నొక మాధుర్యము నందు పర్యవసించి నట్లు, సర్వదుఃఖము ననూహితమైన యొక శాంతాభవము నందు పర్యవసించుచుండెను.
ఆ ! ఆ !! శాంతిని పట్టుకొనవలయును !!!
Leave a Reply